Friday, April 26, 2024
Home అంత‌ర్జాతీయం కార్పొరేట్‌ గుప్పిట్లోకి కరెంట్‌

కార్పొరేట్‌ గుప్పిట్లోకి కరెంట్‌


దేశమంతా పెరిగిన ధరల మధ్య భారంగా దసరా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరింత అంధకారంలో ముంచెత్తబూనడం ఆందోళన కలిగిస్తున్నది. విద్యుత్‌ సంక్షోభంపై వెలువడుతున్న వార్తలూ, ఏలినవారి ప్రకటనలూ చూస్తుంటే దేశం చీకటి అంచుల్లోకి జారిపోతోందా అన్న సందేహం తలెత్తుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేమో ”బొగ్గుకొరత లేదు, విద్యుత్‌ కోత రాదు” అని చెబుతోంటే, అసోంలోని అదే బీజేపీ ప్రభుత్వం ”తీవ్రమైన విద్యుత్‌ కొరత ఏర్పడే ప్రమాదముంది, తక్షణమే విద్యుత్‌ను ఆదా చేసుకునే చర్యలు చేపట్టండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇందులో ఏది నిజం? ఎవరిని నమ్మాలి? కేంద్రం చెప్పేదే నిజమైతే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కానీ అసోంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, జార్ఖండ్‌, బీహార్‌ ప్రభుత్వాలు కూడా తీవ్రమైన విద్యుత్‌ కోతలకు సంకేతాలివ్వడంతో పాటు, ఈ సంక్షోభ నివారణకు విజ్ఞప్తి చేస్తూ కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. బొగ్గు కొరత కారణంగా థర్మల్‌ యూనిట్లు మూసివేసినట్టు, విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయినట్టు పలు రాష్ట్రాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిజాలను దాచిపెడుతోందనీ, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనీ సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, స్పందనలూ ఇలా ఉండగా… దేశంలోని 135 థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లు మున్నెన్నడూ లేనంత బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయనీ, ఇది తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుందనీ సాక్షాత్తూ ”భారతీయ కేంద్ర విద్యుత్‌ అథారిటీ” డేటా స్పష్టం చేస్తోంది. సాధారణంగా ప్రతీ ప్లాంట్‌లో ఎప్పుడూ అదనంగా 14రోజులకు సరిపడా నిల్వలుండాలన్నది ప్రభుత్వ నియమం. కానీ ఇప్పుడు రెండు మూడు రోజులకు మించి నిల్వలు లేవన్నది కనిపిస్తున్న వాస్తవం. బొగ్గు నిక్షేపాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న దేశానికి ఈ దుస్థితి దాపురించిందంటే అందుకు కారణమేమిటి? పరిస్థితి ఇంతకు దిగజారేవరకూ కేంద్ర ప్రభుత్వం ఏమిచేస్తున్నట్టు? ముందుచూపు కొరవడిందా? లేక కావాలనే ఈ స్థితికి తీసుకొచ్చిందా? బొగ్గు ఉత్పత్తి స్థాయిని తగ్గించాలంటూ ”కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌)” పైన, దాని అనుబంధ సంస్థలపైన తీవ్రమైన వత్తిడి వచ్చిందని స్వయంగా సీఐఎల్‌ ఛైర్మన్‌ ప్రమోద్‌ అగర్వాలే చెబుతున్నారు. ఈ మేరకు ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేశారు. సర్కారువారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన డిమాండ్‌ పెరుగుతుంటే.. ప్రభుత్వ రంగంలో బొగ్గు ఉత్పత్తిని తగ్గించాలని నిర్దేశిస్తూ వత్తిడి చేయడంలో కేంద్రం ఉద్దేశ్యమేమిటీ?
ఒక వైపు ఈ సమస్య అంతకంతకు తీవ్రమవుతూ విద్యుత్‌ సంక్షోభానికి దారితీస్తుండగానే, మరోవైపు మరిన్ని బొగ్గు గనుల అమ్మకానికి కేంద్రం తెరలేపింది. ఇప్పటికే గని కార్మికుల తీవ్ర నిరసనలను, ప్రజల ఆందోళనలను ఖాతరు చేయకుండా 28 బొగ్గు బ్లాకులను అమ్మేసిన కేంద్రం.. ఇప్పుడు మరో 40 బ్లాకుల అమ్మకాన్ని చేపట్టింది. తెలంగాణతో పాటు ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, రాష్ట్రాలలో విస్తరించిన ఈ గనుల్లో 55 బిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ముంచుకొస్తున్న సంక్షోభ నివారణకు ప్రయత్నించడం మాని, ఈ సమయంలోనే ఇంతటి అపారమైన ప్రజా సంపదను అమ్మకానికి పెట్టాడంలోని అంతర్యమేమిటి?
ఇదంతా చూస్తుంటే దేశంలోని బొగ్గు నిల్వలన్నిటినీ కార్పొరేట్లకు కట్టబెట్టడం, వారు నిర్దేశించిన ధరలు చెల్లించి వారి నుండి బొగ్గును, కరెంట్‌ను కొనుగోలు చేసి వారికి అంతులేని ఆదాయాలను సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్టు అర్థమవుతున్నది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ బొగ్గు కొరతవల్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలన్నీ మూతపడే పరిస్థితి నెలకొన్నా కేంద్రం చోద్యం చూస్తూ కూర్చుంది. దీనిని బట్టి రాష్ట్రాలు విద్యుత్‌ కోసం అధిక రేట్లకైనా సరే ప్రయివేటు సంస్థల వద్దకు పరుగెత్తక తప్పని స్థితి కల్పించడమే కేంద్రం ఉద్దేశంగా కనబడుతున్నది. ఇటీవల ఏలినవారి చలవతో ఆదానీవారు ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు లీజుకు తీసుకోవడం, ఎగుమతులు ప్రారంభించడం, సరిగ్గా ఈ సమయంలోనే దేశంలో బొగ్గు కొరత ఏర్పడటం, విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఎదురవ్వడం కూడా ఈ అభిప్రాయాలకు మరింత బలం చేకూరుస్తున్నది. ఈ సంక్షోభం కేవలం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం సృష్టించబడిన సమస్య తప్ప మరొకటి కాదని స్పష్టమవుతున్నది. లేదంటే ప్రస్తుత ఈ త్రైమాసికంలో రికార్డుస్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగినప్పటికీ ఇంత తీవ్రమైన కొరత ఏర్పడటంలోని ఔచిత్యమేమిటి? ఇప్పటికే సమస్త ప్రభుత్వరంగాన్నీ నిర్వీర్యం చేసి నష్టాల పేరుతో స్వదేశీ విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఈ కొరతను కూడా ఓ సాకుగా చూపి ”కోల్‌ ఇండియా”ను హౌల్‌సేల్‌గా అమ్మకానికి పెట్టే కుట్రలకూ ఇందులో అవకాశం లేకపోలేదు. పౌరసమాజం ఈ పన్నాగాలను పసిగట్టి మేల్కోవాలి. లేకుంటే కరెంట్‌ వెలుగులు కార్పొరేట్ల గుప్పిట్లో చిక్కుకుపోతాయి, దేశమంతా చీకట్లో కూరుకుపోతుంది.

RELATED ARTICLES

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

అలసత్వం వద్దు… అప్రమత్తత ముద్దు

Omicron Variant: మొదటి, రెండో కరోనా వేవ్‌ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో...

కొత్త ముప్పు.. లాక్‌డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్‌లు తప్పవా?

‘ఒమై‌క్రాన్’ కొత్తగా ఇప్పుడు భయపెడుతున్న కరోనా వేరియంట్. దీని వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఉంటుందనే అపోహలు, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. దక్షిణాఫ్రికాతో పాటు బెల్జియం, హాంకాంగ్...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

అదానీ అనుకూల విధానం

విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం అదానీ అనుకూల విధానంగా తేలిపోయింది.పారిశ్రామికాభివృద్ధి విధానం 20202023ను ప్రకటించినపుడు దానిని వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసంగా...

సర్కారుతో రహస్య ఒప్పందాలున్నాయా?

హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలంసంఘాలకు పీఆర్‌సీ నివేదికనే ఇవ్వలేదుజాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలిప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌...

ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌.

ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త...

పెన్షనర్లకు పెర‌గ‌నున్న డిఎ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఆర్ధిక శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను విడుదల చేసింది. జులై...