Site icon Employees Voice

డిజిటల్‌ హెల్త్‌ కార్డ్‌!

Digital Health Card

Digital Health Card

మీ ఆరోగ్య వివరాలన్నీ అందులోనే
పాత రికార్డులు, రిపోర్టులు, మందులు కూడా
ఎన్డీహెచ్‌ఎంలో మీ ఐడీని మీరే సృష్టించుకోవచ్చు
దేశంలో ఏ ఆస్పత్రికెళ్లినా అది తప్పనిసరి
జీవిత, ఆరోగ్య బీమాలూ దానితో అనుసంధానం

మీరు డాక్టర్‌ దగ్గరకు వెళుతున్నారనుకోండి! అప్పటి వరకూ మీ అనారోగ్యానికి సంబంధించిన రికార్డులు అన్నిటినీ తీసుకెళ్లి చూపించాలి! డాక్టర్‌ చెప్పినట్లు చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్టులు చూపించాలి. మీరు ఏమేం మందులు వాడుతున్నారో చెప్పాలి! కానీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జాతీయ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌’ పథకంతో ఇటువంటి బాదరబందీలు ఏమీ ఉండవు. దీని కింద ప్రతి పౌరుడి అనారోగ్య వివరాలు డిజిటల్‌ పద్ధతిలో రికార్డు కానున్నాయి. ఆధార్‌ కార్డు తరహాలోనే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇవ్వనుంది. పౌరుల అనారోగ్య వివరాలు, వారు చేయించుకున్న వైద్య పరీక్షలు, వాడిన ఔషధ వివరాలను అందులోనే నిక్షిప్తం చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ యాప్‌, వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

దేశవ్యాప్తంగా త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. నిజానికి, గత ఏడాదే జాతీయ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను కేంద్రం ప్రారంభించింది. ‘నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ రికార్డ్స్‌ (ఎన్‌డీహెచ్‌ఆర్‌)’ పేరిట పైలట్‌ ప్రాజెక్ట్‌ను ఈశాన్య రాష్ర్టాల్లో అమలు చేసింది. అప్పుడే యాప్‌, వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకు రానుంది. ఈ కార్డుతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా మన అనారోగ్య సమాచారాన్ని తేలిగ్గా తెలుసుకోవచ్చు. వైద్యుడి వద్దకు వెళ్లిన ప్రతిసారీ పాత రికార్డులు పట్టుకుపోయే తిప్పలుండవు.

మీ గుర్తింపు కార్డు మీరే సృష్టించుకోవచ్చు

ఎన్డీహెచ్‌ఆర్‌ పథకం కింద ఎవరికి వారు సొంతంగానే గుర్తింపు కార్డును సృష్టించుకోవచ్చు. ఆధార్‌, ఇతర ఏదైనా గుర్తింపు కార్డును ఉపయోగించి నేరుగా ఒక ఐడీని పొందవచ్చు. ఇందుకు తొలుత, ఎన్‌డీహెచ్‌ఎమ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ‘క్రియేట్‌ యువర్‌ వోన్‌ హెల్త్‌ ఐడీ’ ఆప్షన్‌ ఉంటుంది. అక్కడ తమ గుర్తింపు కార్డు లేదా ఫోన్‌ నంబరు ఆధారంగా 16 అంకెలతో కూడిన ఐడీని సృష్టించుకోవచ్చు. ఇప్పుడు ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉంది. త్వరలో అన్ని రాష్ట్రాల వారికీ కేంద్రం అవకాశాన్ని కల్పించనుంది. ఆరోగ్య, జీవిత బీమాలను కూడా ఎన్‌డీహెచ్‌ఎమ్‌కు అనుసంధానం చేసే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో, బీమా ఉన్న రోగి ఆస్పత్రిలో చేరగానే, సదరు వ్యక్తి అనారోగ్య వివరాలతోపాటు బీమా వివరాలు కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. బీమా ప్రయోజనాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే వినియోగించుకోవచ్చు.

జాతీయ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను గతేడాది ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అక్కడి సర్కారీ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, వైద్య సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించారు. ఆస్పత్రులకు వచ్చే రోగుల ఆధార్‌, ఫోన్‌ నంబర్లతోపాటు ఇతర వివరాలను తీసుకున్నారు. గుర్తింపు నంబరు అందించేలా ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే కొన్ని లక్షలమందికి కార్డులను సృష్టించారు. అప్పటి నుంచి ఆస్పత్రులకు వెళ్లిన ప్రతిసారీ సదరు వ్యక్తుల ఆరోగ్య వివరాలు వైద్యులు ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు కలిగింది. చికిత్స చేయడమూ వారికి సులభమైంది. అయితే, దేశవ్యాప్తంగా ఈ విధానం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరి వివరాలను ప్రైవేటు లేదా సర్కారీ ఆస్పత్రులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాయా అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే, నిత్యం రోగులతో కిక్కిరిసే సర్కారీ ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ అమలు కష్టసాధ్యమే.