ముఖ్యమంత్రి హామీలను అమలు చేయాలని డిమాండ్.

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యమంత్రి హామీలను అమలు చేయాలని విజయవాడలోని ఎం.బి.వి.కెలో రాష్ట్ర సదస్సు జెఎసి ఛైర్మెన్ ఎం.బాలకాశి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి ఛైర్మెన్ ఎ.వి నాగేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణ, విద్యుత్ కాంట్రాక్టు జెఎసి నాయకులు కట్టా నాగరాజు, ఎం. దుర్గారావు, సి.చంద్రశేఖర్, పి.శివయ్య, డి.సూరిబాబు, ప్రెమ్కుమార్, డేవిడ్ రాజు, హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎ.పి విద్యుత్ రంగసంస్థలైన ఎ.పి.జెన్కో,ఎ.పి ట్రాన్స్కో మరియు ఎ.పి డిస్కం లలో రెండు దశాబ్ధాల కాలంగా 26 వేల మంది పైగా పనిచేస్తున్నారు. ఏళ్ళ తరబడి ఎదుగుబొదుగు లేకుండా పనికి తగిన వేతనం రాక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ప్రజలకి, పరిశ్రమలకి 24I7 మెరుగైన సేవలు అందిస్తున్నారు.
విద్యుత్ సంస్థలోని ఎ.పి.జెన్కో, ఎ.పి ట్రాన్స్కో మరియు డిస్కం కంపెనీ లలో పర్మినెంట్ (రెగ్యులర్) ఉద్యోగులతో సమానమైన పనిచేస్తూ సంస్థయొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నప్పటికి కాంట్రాక్ట్ కార్మికులకు తగినటువంటి వేతనాలు, ఉద్యోగభద్రత లేక ఇబ్బందులకు గురౌతున్నారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్రెడ్డి గారు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను సంస్థలో విలీనం చేసుకుంటామని, దళారి వ్యవస్థను రద్దుచేసి ఉద్యోగభద్రత కల్పిస్తామని ‘‘మొట్టమొదటిగా హామి’’ ఇవ్వటం జరిగింది.తాను ప్రతిపక్ష నేతగా గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ వైసిపి ప్రభుత్వం రాగానే రెగ్యులర్ చేస్తామని నాడు నిండు సభలో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా మొదటి అసెంబ్లీ సమావేశంలో కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించి దళారి వ్యవస్థను రద్దుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన నేటివరకు నోచుకోలేదు. ి ప్రభుత్వం ఏర్పడి 3 సం॥లు దాటుతున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ అమలు చెయ్యకపోగా ఉన్నటువంటి సౌకర్యాలు కోల్పోతూ రకరాల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
సంస్థలను నమ్ముకొని రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించకపోగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులను తొలగించడం ఆనవాయితీగా మారింది. వైసిపి ప్రభుత్వం వచ్చాక నూతనంగా నియమించిన షిఫ్ట్ ఆపరేటర్లకు కేవలం 15 వేలు మాత్రమే ఇస్తూ యాజమాన్యాలు శ్రమదోపిడిచేస్తున్నాయి. సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ విలీనం చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని ఎ.పి కరెంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలజాయింట్ యాక్షన్ కమిటి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సు తీర్మానించడమైనది.
కరోనా కష్టకాలంలో ఎంతో మంది కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందించి చివరికి అశువులు బాశారు. ఎంతో మందికి వెలుగులు నింపిన కార్మికులకు మాత్రం వారి జీవితాలలో వెలుగులు లేకుండా పోయినవి. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న భార్య బిడ్డలని రోడ్డున వదిలేసి అర్ధాంతరంగా జీవితాలు ముగిస్తున్నాయి.చనిపోయిన కార్మికుల కుటుంబాలలో మానవతదృక్పదంతో కారుణ్య నియామకాలు ఇవ్వకుండా యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. సుప్రీంకోర్టు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని తీర్పులు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవటంలేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో దళారీ వ్యవస్ధను రద్దుచేసి ఈ క్రింది విధంగా వేతనాలు చెల్లిస్తున్నారు.తెలంగాణాతో మాదిరి ఎపి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. ప్రధాన డిమాండ్స్విద్యుత్ సంస్థలైన ఎ.పి జెన్కో, ఎ.పిట్రాన్స్కో, ఎ.పి డిస్కంలలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడిని విలీనం చేసి రెగ్యులర్ చేయాలి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి.తెలంగాణా తరహా విధానాన్ని ఏ.పిలో అమలు చెయ్యాలి.
పై డిమాండ్స్ సాధన కోసం క్రింది నిరసన కార్యక్రమాలను జయప్రదంచేయాలని కాంట్రాక్ట్ కార్మికులందరికి సదస్సు ద్వారా ఎ.పి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి (జెఏసి) పిలుపునిస్తున్నది. సదస్సు ప్రారంభానికి ముందు పోలీసులు అనుమతించకుండా అడ్డకున్నారు. సదస్సుకు వచ్చిన సగం మంది కార్మికులు సదస్సు పూర్తి అయ్యే వరకు బందరు రోడ్డుపై నిరసనకు దిగారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.నూర్మహమ్మద్, ఎ.రాజేంద్రప్రసాద్, ఎ. రాజశేఖర్, స్వతంత్రకుమార్, వి.సాంబిరెడ్డి, పి.బాబు, ఎన్. చిన్నరామస్వామి, సి.ప్రూమకుమార్, పి.శ్రీనివాసరావు, వి.రామాంజినేయులు తదితరులు పాల్గోన్నారు.
ఆందోళన ` పోరాట కార్యక్రమాల షెడ్యూల్
ఆగస్టు 4 నుండి ఆగష్టు15 వ తేదిలోపు జిల్లా జెఎసి లు ఏర్పాటు చేయాలి.
ఆగష్టు 16 నుండి ఆగస్ట 25 తేదిలోపు జిల్లా సదస్సులు జరపాలి.
ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 1 వ తేదిలోపు ఎంఎల్ఎ, ఎంపి, ఎంఎల్సి ల ద్వారా సిఎం గారికి రెగ్యులరైజేషన్, సమానపనికి సమాన వేతనం గురించి లెటర్ రాయించాలి.
సెప్టెంబర్ 5 తేదీన 26 జిల్లాలలో జిల్లా కలెక్టర్లకీ వినతిపత్రం ఇవ్వాలి.
సెప్టెంబర్ 6 తేది నుండి సెప్టెంబర్ 12 తేది వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకి హాజరు అవ్వాలి.
సెప్టెంబర్ 13 న ఎస్పిడిసిఎల్ కార్పొరేట్ ఆఫీసు తిరుపతి నిరసన కార్యక్రమాలు
సెప్టెంబర్ 19న సిపిడిసిఎల్ కార్పొరేట్ ఆఫీసు విజయవాడ నిరసన కార్యక్రమాలు
సెప్టెంబర్ 26న ఇపిడిసిఎల్ కార్పొరేట్ ఆఫీసు వైజాగ్ నిరసన కార్యక్రమాలు
సెప్టెంబర్ 28న విటిపిఎస్ ఇబ్రహింపట్నం వద్ద ` బహిరంగసభ
అక్టోబర్ 7 న ఆర్టిపిపి వద్ద ` బహిరంగసభ
అక్టోబర్ 12 న ఎస్డిఎస్టిపిఎస్నేలటూరు వద్ద
బహిరంగసభ
అక్టోబర్ 20న ‘‘ఛలో విద్యుత్సౌద’’ గుణదలు` విజయవాడ