
విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెలలో ఇవ్వాల్సిన జీతం ఇంకా ఇవ్వలేదు. 12వ తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. దీంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం, నిడదవోలు ప్రాంతాల్లో భోజన విరామ సమయంలో అందరూ బయటకు వచ్చి ఆందోళన చేశారు. ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలోని రాజమహేంద్రవరం కాకినాడ, అమలాపురంలలో కూడా నిరసన వ్యక్తంచేశారు. ఏలూరు ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ పరిధిలో నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నర్సాపురం కార్యాలయాల్లో నిరసన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో 2,500 మంది ఉద్యోగులుండగా, వారికి సుమారు రూ.17 కోట్ల జీతాలు ఇవ్వవలసి ఉంది. అటు ఏలూరు సర్కిల్ పరిధిలో 2,800 మంది ఉద్యోగులుండగా, వారి కి సుమారు రూ.15 కోట్లు జీతాలు ఇవ్వవలసి ఉంది. ఇందులో పెన్షనర్లు కూడా ఉన్నారు. విద్యుత్ కొరత ఉందని, కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని చెబుతూ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు. ముఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గురువారం 1104 యూనియన్ ఆందోళన చేయడంతో పెన్షనర్లకు రేపోమాపో జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారు లకు మాత్రం ఈనెల 16వ తేదీ వరకూ కూడా చెప్పలేమనే మాట వినబడుతోంది. కాగా జీతాలు ఇవ్వకపోవడంతో కలత చెంది, ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని డివిజన్ ఆఫీసుల్లో భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తంచేసినట్టు యూ నియన్ జిల్లా జేఎసీ చైర్మన్ వీవీఎస్ నాగేశ్వరరావు, కన్వీనర్ రామకృష్ణ తెలిపారు.