ఎపి జెన్కో ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి నెల జీతాలను ఇంకా చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఎపి పవర్ ఎంప్లాయీస్ జెఎసి ఆధ్వర్యంలో విజయవాడ విద్యుత్ సౌధలోని జెన్కో సిఎండి బి శ్రీధర్ చాంబర్‌ను ఉద్యోగులు ముట్టడించారు. తక్షణమే చెల్లింపులు చేయకపోతే సహాయ నిరాకరణ చేస్తామనిి హెచ్చరించారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని ఎన్టిటిపిఎస్, కృష్ణపట్నం, కడపలోని ఆర్టిపిపి ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్లు, ఓ అండ్ ఎం, ఎస్డిఎస్టిపిఎస్ ఆఫీసుల వద్ద ధర్నాకు దిగారు. ఉద్యోగులపై కక్ష సాధించేందుకు సిఎండి ఉద్దేశపూర్వకంగానే జనవరి జీతాలను చెల్లించలేదని జెఎసి నాయకులు విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ధర్నాకు దిగడంతో జెన్కో సిఎండి శ్రీధర్ స్పందించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మంగళవారం నాటికి జీతాలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు ఆందోళనను విరమించారు. ఇదిలావుండగా, జనవరి నెల జీతాలను తక్షణమే చెల్లించాలంటూ ఎపి పవర్ ఎంప్లాయీస్ జెఎసి చైర్మన్ పి చంద్రశేఖర్, సెక్రటరీ జనరల్ పి ప్రతాప్‌రెడ్డి, కన్వీనర్ బి సాయ కృష్ణతదితరులు ఇంధనశాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే పలు సమస్యలపై ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. ఎపి ట్రాన్స్‌కో సిఎండి ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏడాది నుంచి ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించాలన్నారు.