అంగన్వాడీ సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులే
వారికి కనీస సామాజిక భద్రత అవసరం: సుప్రీం కోర్టు
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గ్రాట్యుటీ పొందడానికి అర్హులేనని సుప్రీం కోర్టు పేర్కొంది. గ్రాట్యుటీ ఇవ్వడం ద్వారా వారికి కనీస సామాజిక భద్రతను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 15.8 కోట్ల మంది చిన్నారుల పోషకాహార బాధ్యతలను చూస్తున్న అంగన్వాడీ సిబ్బంది జీవన పరిస్థితులను మెరుగుపరచాలని ప్రభుత్వాలకు సూచించింది. చట్ట ప్రకారం తమకు గ్రాట్యుటీని వర్తింపచేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, మరికొన్ని సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. దీనిపై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ ఎ.కె.ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ ఆహార భద్రత చట్టం, బాలల సమీకృత అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) అమల్లో అంగన్వాడీ వర్కర్లు కీలకంగా పనిచేస్తున్నారని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఆయా పథకాల అమల్లో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం, లబ్ధిదారుల మధ్య వారధిలా ఉన్నారని పేర్కొంది. గ్రాట్యుటీ కోసం చాలాకాలంగా వారు పోరాడుతున్నారని, చట్ట ప్రకారం వారికి గ్రాట్యుటీని చెల్లించాలని స్పష్టం చేసింది.