Thursday, August 18, 2022
Home జాతీయం 'ఉపా' చట్టంతో ధ్వంసమవుతున్న జీవితాలు

‘ఉపా’ చట్టంతో ధ్వంసమవుతున్న జీవితాలు


అనేక సంవత్సరాలుగా శిక్షా స్మృతిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. కానీ, సమీప భవిష్యత్తులోనైనా కనీసం ‘ఉపా’ చట్టం మానవ జీవితాలను ధ్వంసం చేస్తున్న తీరును కట్టడి చేయాల్సిన అవసరముంది. బెయిల్‌ నిషేధాలను కొట్టివేసి, బెయిలు విచారణ సమయంలో కఠినమైన పరిశీలన కోసం పోలీసు కేసును అదుపులో ఉంచుకోవడంతో అది ప్రారంభం కావాలి. అప్పుడు న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది.

ఢిల్లీ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటూ, నిర్బంధంలో ఉన్న ఉమర్‌ ఖలీద్‌ కు మార్చి 24న ఢిల్లీ సెషన్స్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. యాభై మంది ప్రాణాలను బలిగొన్న ఫిబ్రవరి 2020 హింస కుట్రదారులలో ఉమర్‌ ఖలీద్‌ ఒకడని పోలీసులు ఆరోపించారు. దీనిపై, అనేక మందితో పాటు ఉమర్‌ ఖలీద్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ)- 1967ను ప్రయోగించి విచారణలో ఉన్న కేసు కింద నిర్బంధంలో ఉంచారు. 500 రోజులకు పైగా ఉమర్‌ ఖలీద్‌ జైలులోనే ఉంటున్నాడు. కానీ కేసు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు.
ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసులు విచారణ చేపడుతున్న తీరు సృష్టించిన తీవ్రమైన సమస్యలపై అనేక మంది కథనాలు రాశారు. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం-2019ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని...ఆ నిరసన కార్యక్రమాలు హింసను సృష్టించాయని ఆరోపిస్తూ...రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే నెపంతో కొంతమంది వ్యక్తులపై నేరాలను ఆరోపించారు. ఉమర్‌ ఖలీద్‌ కు బెయిల్‌ నిరాకరణ కూడా అంతే తీవ్రమైన సమస్య. అంటే మన భారత శిక్షాస్మృతి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
ముందుగా, జులై 2021లో ఉమర్‌ ఖలీద్‌ తన బెయిల్‌ దరఖాస్తును కోర్టుకు సమర్పించిన వాస్తవాన్ని పరిగణ లోకి తీసుకోవాలి. అనేక గంటల తరబడి చేసిన వాదనలు, పలు వాయిదాల తర్వాత అంటే ఎనిమిది నెలల తర్వాత బెయిల్‌ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బెయిలు ఇవ్వాలా? లేదా? అనే నిర్ణయం చేయడానికి అనేక వాదనలు, వాయిదాలు, ఎనిమిది నెలల కాలం ఎందుకు తీసుకుంటుందో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. శిక్షాస్మృతి చట్టంలో, ఒక వ్యక్తిపై విచారణ కొనసాగుతూ, అతడు నేరం చేశాడని రుజువు కానంత వరకూ, అతని స్వేచ్ఛను నిరాకరించకుండా హామీ ఇవ్వడమే బెయిల్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వాస్తవానికి సాధారణ పరిస్థితుల్లో, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోతాడా లేదా రుజువులను తారుమారు చేస్తాడా లేదా సాక్షులను బెదిరిస్తాడా అనే విషయాలను న్యాయస్థానాలు పరిగణ లోకి తీసుకుంటాయి. ఒకవేళ పైన ఉదహరించబడిన ప్రమాదాలు జరగవని అనుకున్నప్పుడు, తాను నేరం చేశాడనే విషయం న్యాయస్థానంలో రుజువు కావడానికి ముందు ఆ వ్యక్తికి స్వేచ్ఛను నిరాకరించడంలో అర్థం లేదు. ఇంకోమాటలో చెప్పాలంటే...నేరం రుజువు కానంత వరకు అతడు నిరపరాధే అని భావించాలి.
 పోలీసుల నివేదికను జాగ్రత్తగా చదివి, మొదట చూసినదాని ప్రకారం ఏర్పడిన అభిప్రాయం ఆధారంగా ఆరోపణలు నిజమేనని విశ్వసించేలా జడ్జి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటే...అర్థంకాని న్యాయ పరిభాషతో నిండిన 'ఉపా' చట్టం, వ్యక్తిగతమైన బెయిల్‌ మంజూరును నిషేధిస్తుంది. ఈ కారణంగా, 'ఉపా' చట్టం నేర విచారణకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను బెయిలు మంజూరుకు సంబంధించిన అంశాలుగా మారుస్తుందని నేర న్యాయ నిపుణుడు అభినవ్‌ శేఖరీ పేర్కొన్నారు. 'ఉపా' చట్ట పరిధి లోకి రాని తీవ్రమైన నేరాల్లో కూడా ఇలాంటి ఆనవాళ్ళు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ లోనూ (బెయిలు మంజూరు విషయంలో) ఉన్నాయి. నేరం చేశాడా లేక నిరపరాధా అనే నిర్థారణను విచారణ జరిగి, రుజువులను పరిశీలించి, సాక్షులను విచారించి, వారిని ప్రశ్నించి, వాదనలు పూర్తి అయిన తరువాత నిర్ణయిస్తారు. నేరం చేశాడా లేదా అనే ప్రశ్న బెయిల్‌ మంజూరు చేసే దశలో అవసరమైన వ్యవహారాలకు సంబంధించిన తీరును పక్కదారి పట్టిస్తుంది.
బెయిలు వాదనలను, ఒక చిన్నపాటి విచారణగా మార్చడం మాత్రమే ఇక్కడ సమస్య కాదు. ఈ చిన్నపాటి విచారణలో, ఒక పక్షం వారిని చాలా స్వేచ్ఛగా పోరాడమని అధికారికంగా అనుమతిస్తే, ఇతరులు మాత్రం (బాక్సింగ్‌లో నిబంధనలు పాటించిన విధంగా) నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని వారిని కోరే పద్ధతి ఈ చిన్నపాటి విచారణలో పెద్ద సమస్యగా మారుతుంది. వారి ముందు జడ్జి పూర్తిగా ఒకరి పక్షమే (అంటే పోలీసు వారు ఇచ్చే నివేదిక ఆధారంగా) వహిస్తారు. విచారణలో ప్రత్యర్థుల తరుపు సాక్షులను ప్రశ్నించే, వారి సాక్షాలలో పరస్పర విరుద్ధమైన అంశాలను నిర్ణయించి, వారి స్వంత సాక్షులను పరీక్షించి, తన స్వంత రుజువులను నివేదించే హక్కు ప్రతివాదికి ఉంటుంది. లేదా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు నిజం కాదని వాదించవచ్చు. బెయిలు వాదనల్లో ప్రతివాది అలాంటివి ఏమీ చేయకూడదు. 'పోలీసు వారి నివేదికలో ఉన్న విషయాలన్నీ నిజమే' అనే ఒక 'అవాంఛనీయమైన విశ్వాసం' కలిగి ఉండడం బెయిలు విచారణ లోని మొదటి అంశం. కొన్ని అరుదైన కేసుల్లో వాస్తవాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. లేక పూర్తిగా నమ్మదగనివిగా ఉంటాయి. కాబట్టి బెయిలు దశలో కూడా వాటిపై ఆధారపడే పరిస్థితి లేదు. పోల్చి చూసినప్పుడు, ఇరు వర్గాల మధ్య ఒక చర్చను నిర్వహించి, ఒక వర్గం వారు మాట్లాడిన తర్వాత వారిని ఆపి, మరో వర్గం వారు రెండు మూడు ప్రశ్నలు సంధించడం, ఆ తరువాత తీర్మానం ఆమోదించారని నిర్ణయించడం లాంటిది.
ఇటువంటి పరిస్థితిలో, శిక్షా స్మృతి చురుకుగా, విశ్వసనీయంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవస్థ సమర్థించదగినది. ఉదాహరణకు, ఒకవేళ నేర విచారణలను సాధారణంగా ఆరు నెలల లోపు ముగిస్తే, తీవ్రవాదానికి సంబంధించిన కేసుల్లో విచారణకు ముందు ఆరు నెలల నిర్బంధం బాధాకరమైన విషయమని వాదించే అవకాశం ఉంటుంది. కానీ, భారతదేశంలో అలా కాదు. ఒక 'ఉపా' కేసు విచారణకు సంవత్సరాల సమయం, దాదాపు పది సంవత్సరాల పైగా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, బెయిలుపై కోర్టు నిర్ణయం వాస్తవానికి కేసుకు సంబంధించిన నిర్ణయంగా మారుతుంది. విచారణ కొనసాగుతుంది కాబట్టి, బెయిలు నిరాకరించడమంటే ఆ వ్యక్తి జైలులో ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం గడపుతాడని అర్థం చేసుకోవాలి. 'ఉపా' చట్టం కింద ఉన్న నేరాల రేటు గణనీయంగా తగ్గింది కాబట్టి, విచారణ (నిరపరాధులనే కారణంగా) ముగుస్తుంది.

కాబట్టి, చిక్కులతో కూడిన బెయిలు విచారణలు చేయడానికి ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటుందో ఇది వివరిస్తుంది. నేరారోపణలు చేసిన ప్రాసిక్యూషన్‌ మరియు ప్రతివాది ఇరువురికీ, బెయిల్‌ విచారణ ఫలితమే కేసు ఫలితంగా ఉంటుందని తెలుసు. బెయిలు నిరాకరణ ఫలితమే, నేర పరిశోధన ఫలితం కూడా. అంటే ఒక దశాబ్దం పైగా జైలులో గడపడం. ముందుగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసుల కథనాలను సవాల్‌ చేయకుండా నోరు మూయించి, ‘పోలీసుల కేసు తప్పు’ అని రుజువు చేయలేకపోయాడని శిక్షిస్తారు.
‘నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ’ వర్సెస్‌ ‘జహూర్‌ అహ్మద్‌ షా వటోలీ’ (2019) తీర్పులో సుప్రీంకోర్టు, పోలీసు కేసును కింది కోర్టులు లోతైన పరిశీలన చేయకుండా అడ్డుకోవడం ద్వారా పరిస్థితిని మరింత అధ్వాన్నంగా తయారుచేసింది. ఇది ఉమర్‌ ఖలీద్‌ బెయిలు ఉత్తర్వుల మాదిరిగా హాస్యాస్పదమైన పరిస్థితికి దారితీస్తుంది. కోర్టు ఉమర్‌ ఖలీద్‌ కు వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలను ఉదహరించింది. వాటిలో కొన్ని వదంతులు ఉన్నాయి. కాబట్టి, విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్‌ మంజూరు అనుమతించడం కుదరదు. కొన్ని నమ్మదగిన విధంగా లేవు కాబట్టి ప్రతివాది సవాళ్ళను కొట్టివేసి బెయిల్‌ మంజూరు చేయకుండా నిరాకరించారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న న్యాయ వ్యవస్థలో కూడా ప్రాసిక్యూషన్‌ వారి కోసం, చెప్పింది రాసే స్టెనోగ్రాఫర్లుగా న్యాయస్థానాలు మారాలని ‘ఉపా’ కోరుకుంటుందని న్యాయవాదులు, న్యాయ నిపుణులు తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. చర్చించిన కారణాలు ఏవైనప్పటికీ ఇక్కడ అన్యాయం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి.
అనేక సంవత్సరాలుగా శిక్షా స్మృతిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. కానీ, సమీప భవిష్యత్తులోనైనా కనీసం ‘ఉపా’ చట్టం మానవ జీవితాలను ధ్వంసం చేస్తున్న తీరును కట్టడి చేయాల్సిన అవసరముంది. బెయిల్‌ నిషేధాలను కొట్టివేసి, బెయిలు విచారణ సమయంలో కఠినమైన పరిశీలన కోసం పోలీసు కేసును అదుపులో ఉంచుకోవడంతో అది ప్రారంభం కావాలి. అప్పుడు న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది.

(‘ద హిందూ’ సౌజన్యంతో)
(వ్యాసకర్త ఢిల్లీ లో న్యాయవాది)
గౌతమ్‌ భాటియా

RELATED ARTICLES

ఉద్యోగుల వేతన సవరణకు… ఇక కొత్త పే కమిషన్ ఉండబోదా ?

ఉద్యోగుల వేతన సవరణకు... ఇక కొత్త పే కమిషన్ ఉండబోదా ? కేంద్రం... కొత్త ఫార్ములాతో రాబోతోంది

అంగన్వాడీ సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులే

అంగన్వాడీ సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులే వారికి కనీస సామాజిక భద్రత అవసరం: సుప్రీం కోర్టు అంగన్వాడీ...

ఈపీఎఫ్‌ వడ్డీరేటు భారీగా కోత

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగానే కేంద్రం ‘షాకులు’ ఇవ్వడం మొదలుపెట్టింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును 0.4 శాతం...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...