Thursday, August 18, 2022
Home ఆంధ్ర ప్రదేశ్ ఈపీఎఫ్‌ వడ్డీరేటు భారీగా కోత

ఈపీఎఫ్‌ వడ్డీరేటు భారీగా కోత


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగానే కేంద్రం ‘షాకులు’ ఇవ్వడం మొదలుపెట్టింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును 0.4 శాతం తగ్గించేసింది. 2020-21 సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో జమచేశారు. 2021-22 సంవత్సరానికి దీన్ని 8.1 శాతానికి తగ్గించారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షతన ఈపీఎఫ్‌వో ట్రస్టీల కేంద్ర బోర్డు సమావేశమైంది. ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బోర్డు సిఫారసును కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపనున్నారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన తర్వాత 2021-22 సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటు లెక్కించి ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తారు అని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రస్తుత మార్కెట్‌, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ చెప్పారు. ‘మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు సమీక్షించిన తర్వాత 8.1 శాతం వడ్డీ రేటును సిఫారసు చేశాం. సామాజిక భద్రత, మార్కెట్‌ స్థిరత్వ అంశాలను దృష్టిలో
ఉంచుకొని, మనం అధిక రిస్క్‌ ఉండే సాధనాలను ఎంచుకోలేము. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు. ఇదే విషయాన్ని మంత్రి ట్విటర్‌లోనూ ఉంచారు. కాగా, గత 4 దశాబ్దాల్లో ఈపీఎఫ్‌పై ఇదే కనిష్ఠ వడ్డీ రేటు అని అధికార వర్గాలు తెలిపాయి. 1977-78లో అతి తక్కువగా 8 శాతం వడ్డీ జమ చేశారని, ఆ తర్వాత ఇదే అతి తక్కువ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఏ సంవత్సరం ఎంత తగ్గించారు?2015-16లో ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.8% ఉండేది. 2016-17లో దాన్ని 8.65 శాతానికి తగ్గించారు. 2017-18లో మరింత (8.55 శాతం) తగ్గించారు. కోవిడ్‌ నేపథ్యంలో 2019-20లో దాన్ని 8.5 శాతంకు తగ్గించారు. 2020-21లోనూ 8.5 శాతం వడ్డీ జమచేశారు. ఇప్పుడు ఏకంగా 8.1% కు కుదించారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీని గణనీయంగా తగ్గించాయి. ఈ క్రమంలో ఈపీఎఫ్‌పై అందించే వడ్డీ వేతన జీవులకు ఎంతో ఊరటనిస్తోంది. దీనికి కూడా కోతలు పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రతినెలా జీతంలో కొంత కూడబెడితే.. ఉద్యోగుల భవిష్యనిధి చట్టం-1952 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికుల జీతంలో కొంత మొత్తాన్ని ఉద్యోగ విరమణ అనంతర ప్రయోజనాల కోసం ప్రావిడెంట్‌ ఫండ్‌లో పొదుపు చే యడం తప్పనిసరి. ప్రతినెలా ఉద్యోగులు, కార్మికుల బేసిక్‌ వేతనంలో కనీసం 12 శాతంను ప్రావిడెంట్‌ ఫండ్‌లో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని యజమాని కూడా సంస్థ తరఫున జమ చేస్తారు. ఈపీఎఫ్‌వోలో జమ అయిన ఈ మొత్తాలను వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి, వాటిపై వచ్చే లాభాల నుంచి చందాదారులకు వడ్డీ చెల్లిస్తున్నారు.
షేర్‌ మార్కెట్‌ లాభాలన్నీ ఏమవుతున్నాయి? ఈపీఎఫ్‌వో నిధుల్లో 85%ను ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు తదితర రుణ సాధనాల్లో పెట్టుబడిగా ఉంచుతారు. మరో 15 శాతాన్ని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినప్పుడు ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. అయితే స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులతో భారీ లాభాలు వస్తాయని, ఉద్యోగుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. అయితే, ఏటా వడ్డీ రేట్లు తగ్గిస్తుండటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పెట్టుబడులు ఎలా పెడతారంటే ఈపీఎఫ్‌ నిధుల్లో 45-65 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడతారు. బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు జారీ చేసిన రుణ పత్రాల్లో మరో 20-50 శాతం పెట్టుబడులు పెడతారు. ఇక ఈక్విటీ పెట్టుబడుల విషయానికి వస్తే సెన్సెక్స్‌, నిఫ్టీలను అనుకరించే, సెబీలో నమోదైన ఎంఎఫ్‌, ఈపీఎఫ్‌లలో ఈక్విటీల కోసం పెట్టుబడులు పెట్టొచ్చు. అలాగే, కనీసం రూ.5 వేల కోట్ల పెట్టుబడులున్న కంపెనీల షేర్లలోనూ నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. కాగా, ఈపీఎఫ్‌ఓ రూ.12,785 కోట్లను ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టింది. పెట్టుబడులపై వచ్చే రూ.5,529 కోట్ల మూలధన లాభాలను 2021-22లో చందాదారులకు వడ్డీ చెల్లించేందుకు వినియోగించనుంది. రుణ పత్రాలు, ఈక్విటీల ద్వారా 2020-21లో ఈపీఎఫ్‌వో రూ.72,812 కోట్లు ఆర్జించినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.
వేతన జీవులపై దాడి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలిచ్చిన విజయానికి ఇది ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ అని కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. 5 రాష్ట్రా ల ఎన్నికలు అయిపోగానే ‘కోట్లాది మంది పొదుపు’ పై దాడి చేయడం సరైనదేనా? అని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే మోదీ ప్రభుత్వం వేతన జీవులపై దాడి పెంచిందని, దీన్ని ప్రతిఘటించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్‌ చేశారు. ఎన్నికలవగానే బీజేపీ ప్రభుత్వం తన అసలు రంగు బయటపెట్టిందని వామపక్ష ఎంపీ బినోయ్‌ విశ్వం విమర్శించారు. వడ్డీ రేటు తగ్గించే విషయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ‘సభ్యులు, పెన్షనర్ల జీవన సౌలభ్యం కోసమే లక్ష్యమని ఈపీఎఫ్‌ సంస్థ లక్ష్యాల్లో పేర్కొన్నారు. వడ్డీ రేటు తగ్గించడం దారుణం’ అని లేఖలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

వైద్య ఆరోగ్య శాఖ‌లో సిబ్బంది కుదింపు వ‌ద్దు

వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్‌ పేరుతో ప్రతి పిహెచ్‌సి లో 12 మంది సిబ్బందియుండేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 143ను సవరించాలని, ప్రస్తుతం...

1న సీఎం ఇల్లు ముట్టడికి సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయం

2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు93 వేల మంది సచివాలయాల ఉద్యోగులూ రావాలని విజ్ఞప్తిభవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవాలని సూచనహామీపై జగన్‌ మడమ తిప్పేశారని...

అంగన్వాడీ సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వండి

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ఎంప్లాయీస్ వాయిస్ః అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ మేరకు సంఘ...